దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను శనివారం సారంగాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో కలాం గుణం విద్యా, యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘం సభ్యులు పాల్గొని, ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కోనేరు భూమన్న మాట్లాడుతూ, దేశంలో విద్య, ముఖ్యంగా సాంకేతిక విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి మహోన్నతమైనదని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా మహనీయుల సేవలను స్మరించుకోవాలనే ఉద్దేశంతో 15 రోజుల పాటు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రానంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశంలో ఉన్నత విద్య, సాంకేతిక విద్యాభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికలతో కృషి చేశారని గుర్తుచేశారు. ప్రతిభావంతులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించడంలో ఆయన ముందుండేవారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్, సంఘం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్, గౌరవ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్, మహమ్మద్ కరీముద్దీన్, మహమ్మద్ జుబేర్ హుస్సేన్ ఖాన్, తాజీమ్ ఖాన్, మండల అధ్యక్షుడు మాధవరావు, ఉప సర్పంచ్ ఆయిర కృష్ణారెడ్డి, నక్క రాజన్న, వీరయ్య, సంఘం మండల అధ్యక్షుడు సయ్యద్ నాయిముద్దీన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కబీర్, సర్పంచ్ దిలీప్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.












