ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి పౌరుడు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ బి. విజయ్కాంత్రావు అన్నారు. భారత ఎన్నికల సంఘం, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన, ప్రశ్నావళి పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన ఓటర్లుగా మారి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. పోటీల సందర్భంగా భారత ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల నిర్వహణ విధానం, ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో పౌరుల బాధ్యతలు, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ, ఓటరు నమోదు ప్రక్రియ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఎన్నికల ప్రాధాన్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటరు చైతన్యం వంటి అంశాలపై తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు. ప్రశ్నావళి పోటీల్లో భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగం, ఓటు హక్కుకు సంబంధించిన ప్రశ్నలకు విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు తదుపరి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించడం, భవిష్యత్తులో చైతన్యవంతమైన ఓటర్లుగా తీర్చిదిద్దడం, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకైన భాగస్వాములుగా మార్చడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు శంకర్, గిర్దావర్ వెంకట నర్సయ్య, గ్రామ పంచాయతీ అధికారి వరలక్ష్మి, సవిత, సాగర్, కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












