జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలతో బిచ్కుందలోని రిపుల్స్ లెర్నింగ్ క్యాంపస్‌లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి ఒక్కరినీ గౌరవం, దయ, ప్రేమతో చూడడం, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిపట్ల వివక్ష చూపకపోవడం, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా సహకరించడం వంటి 10 అంశాలపై ప్రతిజ్ఞ చేశారు.
మానసిక ఒత్తిడితో బాధపడేవారి సమస్యలను ఓపికగా వినడం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం, అపోహలు, వివక్షను తొలగించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, మానసిక సమస్యలతో బాధపడేవారికి అండగా నిలవడం వంటి అంశాలపై సంకల్పం ప్రకటించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ, సమస్యలను ఇతరులతో పంచుకోవడం, అవసరమైనప్పుడు సహాయం కోరడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మానసిక ఆరోగ్య సహాయం కోసం టెలీ-మానస్ 14416 హెల్ప్‌లైన్ నంబర్‌ను తెలియజేశారు.
ఈ కార్యక్రమం నిర్వహించడంపై పాఠశాల ప్రిన్సిపాల్ బాలరాజ్, వ్యవస్థాపకులు అనిల్ కుమార్ పాటిల్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను వివరించడంతో పాటు, తమ భావాలను స్వేచ్ఛగా పంచుకోవడం, ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు సహాయం కోరడం వంటి మంచి అలవాట్లపై మార్గనిర్దేశం చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

