నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని శనివారం తహసీల్దార్ బి. విజయ్ కాంత్ రావు సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం నాణ్యత, ఆహార పట్టిక, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్యం, వసతి గృహంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై ఆరా తీశారు.
వసతి గృహ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థినులకు సూచించారు. బాలికలకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థినుల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో వసతి గృహ ప్రిన్సిపాల్ శోభ, గిర్దావర్ వెంకట నర్సయ్య, జాం గ్రామ పంచాయతీ అధికారి రమేష్, వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

