ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, మానవతా దృక్పథంతో సమాజ సేవలో సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని, రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతనంగా ఎంపికైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.
రెడ్‌క్రాస్ సంస్థ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే గొప్ప మానవతా సేవా సంస్థ అని కలెక్టర్ పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించి, అత్యవసర సమయంలో రోగులకు సకాలంలో రక్తం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యువతను రక్తదానానికి ప్రోత్సహించడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేలా సభ్యులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
పేదలు, అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
నూతనంగా ఎంపికైన సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థకు మరింత మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చేపట్టాల్సిన కార్యక్రమాలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, వాటి అమలును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.
అనంతరం, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి కేటాయించాలని రెడ్‌క్రాస్ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి ఎం. సత్యనారాయణ, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు గొజ్జ జనార్ధన్, వైస్ చైర్మన్ ఎం.సి. లింగన్న, ట్రెజరర్ అల్లాడి రవి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సమన్పల్లి రాఘవులు, సభ్యులు భూమయ్య, గంగన్న, నాగభూషణం, రాజేశ్వర్, రమేష్, ముజాహిద్, సాయన్న, రవీందర్, చిన్నయ్య, రాజన్న, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.








