సెంట్రల్ పర్చేసింగ్ విధానం వల్ల ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులు, వార్డెన్లు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న సెంట్రల్ పర్చేసింగ్ విధానం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు, హాస్టల్ వార్డెన్లకు ఇబ్బందులు సృష్టించడం సరికాదని జిల్లా కన్వీనర్ దిగంబర్ అన్నారు. గతంలో ఉన్న పాత పద్ధతి ప్రకారమే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ ద్వారానే కొనుగోళ్లు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సెంట్రల్ పర్చేసింగ్ స్కీమ్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందే పరిస్థితి లేదని దిగంబర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, పప్పు, కారం వంటి వాటి ధరలు 40 నుండి 50 వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు పౌష్టికాహారం ఎలా అందించాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న మెస్ చార్జీలు ఏమాత్రం సరిపోవని ఆయన అన్నారు. ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, మెస్ చార్జీలను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వెంటనే సెంట్రల్ పర్చేసింగ్ విధానాన్ని విరమించుకొని, పాత పద్ధతినే అమలు చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాలు పోరాటాలను ఉధృతం చేస్తామని దిగంబర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కార్తీక్, రాహుల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.












