తెలంగాణ, 8 September
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నల్ల టీషర్టుతో నిరసన తెలిపారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం తన టీషర్టును విప్పేశారు.
*అసెంబ్లీ ముందు టీ షర్టు విప్పిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* *పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వివాదం* *కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా?* *నల్ల టీషర్టు విప్పి నిరసనకు దిగిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి..* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. 1000 రోజులు గడిచినా హామీల అమలుపై సమాధానం చెప్పకుండా ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలోకి నల్ల టీషర్టుతో వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తన టీషర్టును విప్పేశారు. అయినప్పటికీ పోలీసులు ఆయనను అర్థనగ్నంగా కూడా అసెంబ్లీలోకి అనుమతించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఏ మేరకు సమంజసమని నవీన్ రెడ్డి ప్రశ్నించారు. “100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. 1000 రోజులు గడిచినా ప్రజలకు సమాధానం చెప్పరా? ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారా?” అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే నల్ల టీషర్టులతో నిరసన చేపట్టామని, తమ నిరసనను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన అసహనాన్ని బయటపెట్టుకుందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తారా? అని ప్రశ్నిస్తూ.. నవీన్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.. KP












