న్యూఢిల్లీ, ఢిల్లీ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చట్టబద్ధమైనదే అయినా, న్యాయసమ్మతమేనా అని మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన, శాసనబద్ధమైన సంస్థలు బలవంతుడిదే రాజ్యం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాయని ఆయన విమర్శించారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలపై అన్యాయమైన ప్రక్రియను రుద్దిన సర్, న్యాయవ్యవస్థ కూడా సమర్థించిందని ఆయన పేర్కొన్నారు.
** 'సర్’ చట్టబద్ధమే, కానీ న్యాయసమ్మతమేనా: __ అశోక్ లవాసా.. The Wire Staff September 7, 2026 Reading Time: 2 minutes ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) “చట్టబద్ధమైనదే, కానీ అది న్యాయసమ్మతమేనా?” అని ప్రశ్నిస్తూ, రాజ్యాంగ బద్ధమైన, శాసనబద్ధమైన సంస్థలు “బలవంతుడిదే రాజ్యం” అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాయని మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా విమర్శించారు. “చట్టపరమైన అధికారం ఉన్న సంస్థలు, తాము ఏమి చేసినా సరియైనదేనని భావిస్తున్నాయి. దేశంలోని లక్షలాది మంది ప్రజలపై అన్యాయమైన ప్రక్రియను రుద్దిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అందుకు ఒక ఉదాహరణ, దీనిని న్యాయవ్యవస్థ కూడా సమర్థించింది” అని లవాసా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నిర్వహించిన ‘ప్రొఫెసర్ జగదీప్ సింగ్ ఛోకర్ మెమోరియల్ లెక్చర్’లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కచ్చితంగా, ఇది చట్టబద్ధమైనదే. కానీ, ఇది న్యాయసమ్మతమేనా?” అని ఆయన ప్రశ్నించారు. న్యాయం అంటే కేవలం చట్టంలో ఏం రాసి ఉన్నదో దానిని అమలు చేయడం మాత్రమే కాదని, దాని స్ఫూర్తిని పరిరక్షించడం కూడా అని ఆయన అన్నారు. మరింత స్పష్టం చేస్తూ, “ఇది కచ్చితంగా న్యాయమైనది కాదు” అని మాజీ ఎన్నికల కమిషనర్ ఉద్ఘాటించారు.మోది 13 కోట్ల ఓట్ల తొలగింపు సమర్థనీయమా?.. “ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్ల తొలగింపును మీరు ఎలా సమర్థిస్తారు?” అని లవాసా ప్రశ్నించారు. “ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల ప్రజలు విరక్తి చెందే పరిస్థితిని సృష్టించడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఇప్పటికే 33 శాతం మంది అసలు ఓటు వేయడం లేదు. లోక్సభ ఎన్నికల్లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం 67 శాతం మాత్రమే. ఇప్పుడు ప్రజలు తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడాన్ని ఎంతో క్లిష్టతరం చేసే వాతావరణాన్ని మనం సృష్టిస్తున్నాము. వారి రాజ్యాంగ హక్కు విషయంలో తీవ్ర ఆందోళన నెలకొన్నది” గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన గుర్తుచేశారు. ముసాయిదా జాబితాలో 6.15 కోట్ల పేర్ల తొలగింపు.. ది వైర్ నివేదించిన కథనం ప్రకారం, ‘సర్’ మూడవ విడత కోసం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాల ద్వారా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 6.15 కోట్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినట్లు వెల్లడైంది. అంతిమ ఓటర్ల జాబితాలు ప్రచురించబడినప్పుడు ఈ సంఖ్యలు మారే అవకాశం ఉన్నప్పటికీ, ఈ స్థాయి తొలగింపులు సర్ ప్రక్రియకు ముందు ఉన్న ఓటర్ల జాబితాల ప్రామాణికతపై మళ్లీ ప్రశ్నలను లేవనెత్తాయి. మహారాష్ట్రలో, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన మొత్తం ఓటర్లలో మూడో వంతు మంది పేర్లు ప్రచురించిన జాబితాలో తొలగించబడ్డాయి. కర్ణాటకలో, 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లలో దాదాపు సగం మంది పేర్లు తొలగించబడ్డాయి. తెలంగాణలో 2023 ఎన్నికల్లో ఓటు వేసిన వారిలో మూడో వంతు కంటే కాస్త తక్కువ సంఖ్యలో తొలగింపులు నమోదయ్యాయి. అత్యధిక శాతం తొలగింపుల పరంగా చూస్తే, 32.78 శాతం తొలగింపు రేటుతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో దాద్రా నగర్ హవేలీ, డామన్ దీవులు(29.65 శాతం), తెలంగాణ (21.69 శాతం), మహారాష్ట్ర (21.14 శాతం), కర్ణాటక (19.48 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (19.09 శాతం) ఉన్నాయి. ఛోకర్ సేవలు చిరస్మరణీయం.. లవాసా ఛోకర్తో తనకున్న అనుబంధాన్ని, ఉర్దూ షాయరీ పట్ల వారిద్దరికీ ఉన్న ఉమ్మడి ఆసక్తిని గుర్తు చేసుకున్నారు. ఛోకర్ 1999లో ఏడీఆర్ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఆయన ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కుల కార్యకర్త, న్యాయవాది, ఇంజనీర్, పర్యావరణ పరిరక్షకుడు. ఈ కార్యక్రమంలో ఆయన రాసిన వ్యాసాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రజా జీవితంలో పారదర్శకతను తీసుకురావడానికి ఛోకర్ చేసిన కట్టుబాటు ఆయన జీవితాన్ని విశిష్టంగా తీర్చిదిద్దిందని లవాసా పేర్కొన్నారు. అనువాదం: కె సత్యరంజన్


