జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) జిల్లా అధ్యక్షులు ఎస్. ఆంజనేయులు కోరారు. జిల్లా కలెక్టరేట్‌ను కలిసి అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు టీజేఏ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ, సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా తగిన స్థాయిలో చొరవ చూపలేదనే భావన జర్నలిస్టుల్లో ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
టీజేఏ విజ్ఞప్తి
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని టీజేఏ తరఫున విజ్ఞప్తి చేశారు. యూనియన్ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల కోసం, వారి ఇళ్ల స్థలాలు, ఇళ్ల సాధన కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు.
అదనపు కలెక్టర్ హామీ
జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ స్పందిస్తూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. సత్యనారాయణ, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు వంగ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లింగమూర్తి, కోశాధికారి సిహెచ్. మహేందర్, ఈసీ సభ్యులు లింగాల బాబు, యూనియన్ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.












