వినాయక చవితి పండుగ ముగిసిన తర్వాత గణపతి విగ్రహాన్ని నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారనే దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక భావం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం వీడ్కోలు పలకడం మాత్రమే కాదని, భారతీయ తాత్విక భావనను గుర్తు చేస్తుందని పండితులు వివరిస్తున్నారు.
వినాయక చవితి వచ్చిందంటే ఇంటింటా గణనాథుడిని ప్రతిష్ఠిస్తాం, భక్తిశ్రద్ధలతో పూజిస్తాం, నైవేద్యాలు సమర్పిస్తాం. కానీ పండుగ ముగిసిన తర్వాత అదే గణపతి విగ్రహాన్ని నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తాం దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావం ఉంది.
పురాణ సంప్రదాయాల్లో గణపతి జన్మకథకు అనేక రూపాలు ఉన్నాయి. పార్వతీదేవి సృష్టించిన బాలుడే గణేశుడిగా, అనంతరం శివుడి అనుగ్రహంతో గజాననుడిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అయితే నిమజ్జనం వెనుక ఉన్న ప్రధాన భావం ఆవాహన, పూజ, ఉద్వాసన. అంటే దైవాన్ని ఒక రూపంలో ఆహ్వానించి, భక్తితో పూజించి, పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత గౌరవంగా వీడ్కోలు పలకడం.
మట్టితో తయారైన గణపతి విగ్రహం పూజ అనంతరం నీటిలో కలుస్తుంది. మట్టి నుంచి రూపం, రూపానికి పూజ, పూజ తర్వాత లయం, మళ్లీ ప్రకృతిలోకి ఆ రూపం. ఇది సృష్టి, స్థితి, లయ అనే భారతీయ తాత్త్విక భావనను గుర్తు చేస్తుంది.
గణపతి నిమజ్జనం అంటే దేవుడిని వదిలేయడం కాదు. రూపం నీటిలో కలిసినా, భక్తి మన హృదయంలో నిలవాలి అనే సందేశం. అందుకే భక్తులు గణపతికి వీడ్కోలు పలుకుతూ గణపతి బప్పా మోరియా, మళ్లీ వచ్చే ఏడాది త్వరగా రా అంటారు. ఇదే గణనాథుడి నిమజ్జనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం.












