నిర్మల్ జిల్లా మండలంలోని ఝరీ బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధీరజ్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది.
మండలం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న ధీరజ్‌ను శనివారం పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్, ఉపాధ్యాయుడు ధీరజ్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గైక్వాడ్ సాయినాథ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, జీవితంలో ముందుకు సాగేందుకు అవసరమైన స్ఫూర్తిని అందిస్తారని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వారి కృషికి గుర్తింపుగా అవార్డులు లభించడం అభినందనీయమన్నారు.
ఝరీ బి పాఠశాల తరఫున ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ధీరజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉత్తమంగా సేవలందించి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అలేఖ్య రెడ్డి, ఉపాధ్యాయ బృందం సభ్యులు నాగేందర్, ప్రైమరీ హెడ్మాస్టర్ ఓం ప్రకాష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.












