బైంసా పట్టణంలో మంగళవారం జరిగిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో మత సామరస్యాన్ని చాటే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. హిందూ, ముస్లిం సోదరులు పరస్పరం భాయ్ భాయ్, హమ్ సబ్ ఏక్ హై అంటూ నినాదాలు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర పంజేషా మసీదు సమీపానికి చేరుకున్న సమయంలో ఈ సోదరభావం వెల్లివిరిసింది. మతాలకు అతీతంగా ఐకమత్యంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ నినాదాలు చాటాయి.
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజలు సంయమనం పాటిస్తూ ఉత్సవాన్ని కొనసాగించారు. రెండు వర్గాల మధ్య పరస్పర సహకారం, స్నేహభావం కనిపించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.












