అర్ధరాత్రి వేళ అధిక శబ్దంతో బుల్లెట్ బైక్‌ను నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్‌ను అమర్చిన బుల్లెట్ బైక్‌ను సీజ్ చేశారు.
బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో అధిక శబ్దంతో బైక్‌ను నడుపుతూ వీధుల్లో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమవుతున్న అతడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ.. వాహనాలకు అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసే, నిబంధనలకు విరుద్ధంగా మార్చిన సైలెన్సర్లను అమర్చుకోవడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించబోమని ఆయన అన్నారు.
చట్టపరమైన చర్యలు
నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చుకున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడం, రాత్రివేళల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పోలీసు శాఖ బాధ్యతల్లో భాగమని ఆయన తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు నడపకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.












