గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఐపీఎస్ శుక్రవారం షాద్‌నగర్ బొబ్బిలిచెరువులో పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంలో భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించిన సీపీ తరుణ్ జోషి, అక్కడి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట డీసీపీ శిరీష రాఘవేంద్ర, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సిఐ సీతారాంతో పాటు పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.
నిమజ్జన ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ పలు సూచనలు చేశారు. గణేష్ నిర్వాహకులు, భక్తులతో పోలీసులు సహనంతో, సంయమనంతో, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.
మున్సిపల్ సిబ్బంది చేపట్టిన ఏర్పాట్లను కూడా సీపీ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెరువు పరిసరాల్లో తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ నిర్వాహకులతో సీపీ మాట్లాడారు. విగ్రహాలను జాగ్రత్తగా, ఎలాంటి నష్టం కలగకుండా నిమజ్జనం చేయాలని సూచించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని క్రేన్ నిర్వాహకులకు స్పష్టం చేశారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా పోలీసు, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీపీ ఆదేశించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












