న్యూఢిల్లీ, ముంబై, ఆంధ్రప్రదేశ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 14
బిజెపి, ఎన్డిఎ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 2029 నాటికి ఏకరూప పౌరస్మృతి (యుసిసి) ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత, మైనారిటీల్లో భయాందోళనలు, ప్రపంచవ్యాప్త విమర్శలు ఉన్నప్పటికీ యుసిసి అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
** 21 రాష్ట్రాల్లో యుసిసి , - 2029లోగా అమలు చేస్తామన్న అమిత్ షా న్యూఢిల్లీ : బిజెపి, ఎన్డిఎ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 2029 నాటికి ఏకరూప పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ - యుసిసి) ప్రవేశపెడతాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించారు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, మైనారిటీల్లో భయాందోళనలు చోటుచేసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా.... యుసిసిని అమలు చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం గమనార్హం. ముంబైలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని, పలు రాష్ట్రాల్లో యుసిసి ప్రవేశపెట్టామని, 2029 నాటికి బిజెపి - ఎన్డిఎ పాలనలో ఉన్న 21 రాష్ట్రాల్లో యుసిసి ప్రవేశపెడతామన్న నమ్మకం తనకుందని అన్నారు. ఎన్డిఎ పాలనలో ఉన్న ఆంధ్రపదేశ్ కూడా ఈ జాబితాలోనే ఉంది. యుసిసికి బిజెపి కట్టుబడి ఉందని, ప్రధాని మోడీ ఇచ్చిన హామీ అని అమిత్ షా చెప్పారు. 'భారతీయ న్యాయ సంహిత' ద్వారా దేశ నేర న్యాయ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని, అనేక రాష్ట్రాల్లో నేరస్తులకు శిక్ష పడే రేటు ఒకే ఏడాదిలో 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోపు న్యాయం అందేలా చూసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370, 35ఎ రద్దు ప్రక్రియ ఒక్క చుక్క రక్తం చిందించకుండా లేదా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా విజయవంతంగా పూర్తయిందని షా అన్నారు. ఐదు దశాబ్దాల నక్సలిజం ముగిసిందని, 14కు పైగా శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. తొమ్మిది వేల మందికి పైగా లొంగిపోయారని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, 'ఆపరేషన్ సింధూర్' వంటి చర్యల ద్వారా ఉగ్రవాదం పట్ల 'జీరో టాలరెన్స్' విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మణిపూర్లో 'నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్' (ఎన్ఆర్సి) అమలుకు 1951 నాటి ప్రాతిపదికను ఉపయోగించడంపై మిత్రపక్షాలు, రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను ముంబై వంటి నగరాల్లో గుర్తించడానికి ఉపయోగించే పద్ధతులను, సాధనాలను వెల్లడించబోమని తెలిపారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా 'నషా ముక్త్ భారత్ అభియాన్' (వ్యసన రహిత భారత ఉద్యమం)ను తాను ప్రారంభించానని, ప్రతి రాష్ట్రాన్ని సందర్శిస్తానని, ఈ ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని తెలిపారు.












