మిర్యాలగూడ, 14 November
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల ప్రముఖ విద్యాసంస్థ చైతన్య పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) లో శనివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. పిల్లలు చాచా నెహ్రూతో పాటు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఆర్మీ జవాన్ల వేషధారణలలో, విద్యార్థినులు భరతమాత, శివపార్వతుల వేషధారణలతో అలరించారు. అద్భుతమైన వేషధారణ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు జయంతి నర్సిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ, జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో విశేషమని అన్నారు. పిల్లల కోసం, దేశ భవిష్యత్తు కోసం పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని అందుకునేలా ప్రణాళికలను సిద్ధం చేశారని తెలిపారు.
పేదరికంలో మగ్గుతున్న భారతదేశాన్ని విద్యారంగం మాత్రమే ముందుకు తీసుకురాగలదని ఆయన దృఢంగా విశ్వసించారు. నేటి బాలలే రేపటి పౌరులుగా సమాజానికి సేవలు అందించి ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని నెహ్రూ ఆకాంక్షించారని, ఆయన సేవలను కొనియాడారు. పిల్లలు తమ గమ్యాన్ని కచ్చితంగా చేరుకోవడానికి, చదువు కోసం ఒక ప్రణాళికను రూపొందించుకుని, దాని అనుగుణంగా ముందుకు వెళితే తప్పక విజయం సాధిస్తారని ఆయన అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ జయంతి మాట్లాడుతూ, పిల్లల వేషధారణకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెహ్రూ విద్యార్థుల కోసం చేసిన కృషిని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






