కరువు నేపథ్యంలో ప్రజలకు ఉపాధి పనులను విస్తరించాలని, నిరంతరం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని అఖిలభారత రైతు- కూలీ సంఘం () రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ డిమాండ్లు వినిపించాయి.
కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ, వాటి నివారణకు ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టలేకపోతోందని ఆయన అన్నారు. ముందుగా ఉపాధి పనులను విస్తరించి, 200 రోజులు పని కల్పించి, రోజుకు రూ.700 కూలీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు కాలంలో వ్యాపారులు పాత బియ్యం ధరలను క్వింటాలుకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు పెంచుతున్నారని, ఇదేవిధంగా పప్పులు, నూనె, కారం, చింతపండు వంటి నిత్యవసర సరుకుల ధరలను పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు.
మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్న వ్యాపారులను కట్టడి చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కరువు నివారణలో భాగంగా రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికి అందిస్తున్న 6 కిలోల బియ్యానికి బదులు 10 కిలోలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, నిత్యవసర సరుకులైన పప్పులు, నూనె, చింతపండు, కారం, అల్లం వంటి 12 రకాల వస్తువులను రేషన్ షాపుల ద్వారానే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ఇచ్చే రూ.12,000 బకాయిలను గత పాలనా కాలం నుంచే చెల్లించాలని ఆయన కోరారు. రైతులు ఖరీఫ్ లో తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేసి, ఆ రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రబీ సీజన్ కు గాను రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించి, పొద్దుతిరుగుడు, ఆయిల్ ఫామ్, శనగలు, కుసుమ, మినుములు, పెసర్లు వంటి పంటలను ప్రోత్సహించి, వాటి విత్తనాలను రైతులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో అధ్యక్షులు సూర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, షేక్ చిన్న అలీ, భాగ్య, ఆశ బి, హిమమ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.












