ఎల్ ని నో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటలనే వేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. బైంసాలో గురువారం కేంద్ర ప్రభుత్వం 50 సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో మిషన్ ఫర్ ఆత్మనిర్బరత ఇన్ పల్సేస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చిన్న కారు రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సూచించారు. నియోజకవర్గంలో అన్ని మండలాలకు కలిపి 9000 బస్తాల శనగ విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది లోటు వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగా విద్యుత్ సరఫరా తగ్గే అవకాశం ఉందని, కాబట్టి రైతులు నష్టపోకుండా ఉండేందుకు శనగ, సన్ ఫ్లవర్, నువ్వులు వంటి ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు.
భూగర్భ జలాలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి గ్రామాల్లో సర్పంచులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల విజ్ఞప్తి మేరకు సన్ ఫ్లవర్ విత్తనాలను కూడా సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, వ్యవసాయ శాఖ ఏడీఏ, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.












