రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. శనివారం మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి రూ.6 లక్షల పరిహారంతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.
మండల కేంద్రానికి చెందిన జాదవ్ బాలాజీ, దొంతుల వార్ పోశెట్టి (ఉరి), దౌలతాబాద్ గ్రామానికి చెందిన రాజుల వెంకన్న కుటుంబాలను గ్రామ సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పటేల్‌తో కలిసి సంగెపు బొర్రన్న పరామర్శించారు. కుటుంబ సభ్యుల నుంచి వారి ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గత రెండు, మూడు సంవత్సరాలుగా అతివృష్టి, అల్పవృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వడం లేదని బొర్రన్న తెలిపారు. రైతులు సోయాబీన్, పత్తి వంటి పంటలకు అధిక పెట్టుబడులు పెట్టినా, తగిన దిగుబడి రాక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, పెట్టిన ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో కొందరు రైతులు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నంబర్ 194 ప్రకారం రూ.6 లక్షల పరిహారం అందించాలని, ఆయా కుటుంబాలకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసా కల్పించాలని ఆయన కోరారు. కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5,000 పెన్షన్, పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రైతు ఆత్మహత్యలను నివారించేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల సాగుతో పాటు కోళ్ల పెంపకం, పాడి పశువులు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించాలని అన్నారు.
ప్రతి రైతు కుటుంబానికి నెలకు కనీసం రూ.15,000 ఆదాయం లభించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సంగెపు బొర్రన్న కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పటేల్, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి పవార్ భీంరావ్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.












