వ్యవసాయ పనుల సమయంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని అబ్దుల్లాపూర్ విద్యుత్ ఉపకేంద్రం పరిధి లైన్మెన్ సాయిబాబా సూచించారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, కోత యంత్రాలు వంటి భారీ వ్యవసాయ యంత్రాలను పొలాల్లోకి తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ తీగల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
పొలాల్లో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో కనిపించినా వాటికి సమీపంగా వెళ్లకూడదని సాయిబాబా సూచించారు. వ్యవసాయ యంత్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే ముందు మార్గంలోని విద్యుత్ లైన్లను పరిశీలించాలని, యంత్రాలు విద్యుత్ తీగలకు తగలకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నా, ఇతర సమస్యలు కనిపించినా రైతులు స్వయంగా వాటిని సరిచేసే ప్రయత్నం చేయకుండా వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. సిబ్బంది సలహాలు, సూచనల మేరకే అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల పట్ల నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పుగా మారుతుందని సాయిబాబా హెచ్చరించారు. ఒక్క క్షణం అప్రమత్తత ఒక కుటుంబాన్ని ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్, కోత యంత్రాల యజమానులు విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.












