నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని, దీనిని అడ్డుకునే అధికారులు కరువయ్యారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతంలో సహజ వనరుల దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనిని అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడని పేర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు వాపోతున్నారు. మండలంలోని ఆలూరు, బోరిగం, యాకరి పెళ్లి సారంగాపూర్, వంజర్, బీరవెల్లి, కంకెటా, ధోనిగాం, తాండ్ర గ్రామాల్లోని స్వర్ణ వాగు పరివాహక ప్రాంతం నుంచి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా జోరుగా అక్రమ ఇసుక రవాణా దందా కొనసాగుతోంది.
ప్రభుత్వానికి నష్టం
కాసులకు కక్కుర్తి పడి ఈ అక్రమ దందా రోజురోజుకూ పెరిగిపోతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ దందాతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోందని, పట్టపగలే సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
రాత్రి వేళల్లో రవాణా
గత కొద్ది రోజులుగా ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతోంది. ఎక్కువగా రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పొలాల్లో ఇసుకను డంపింగ్ చేసి, టిప్పర్ల ద్వారా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తీరుపై అనుమానాలు
అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు భావిస్తున్నారు. ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్మిషన్ లేకుండా ఇసుకను తరలిస్తున్నారని ప్రశ్నిస్తే, అధికారుల అండదండలు ఉన్నాయని, ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగుతున్న సందర్భాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.












