గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో జరుగుతున్న వెలివేతలు, వివక్షను అరికట్టి, వాటిని రద్దు చేసేందుకు కృషి చేయాలని తాళ్లరాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ బాధితులు కోరారు. హైదరాబాద్లో గ్రామ అభివృద్ధి కమిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగను కలిసి తమ సమస్యలను వివరించారు.
తాళ్లరాంపూర్లో గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో తమపై జరుగుతున్న వెలివేత, వివక్షతో పాటు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బాధితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మంద కృష్ణ మాదిగ స్పందన
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో కొనసాగుతున్న సాంఘిక బహిష్కరణలు వంటి ఘటనలు ప్రస్తుత కాలంలోనూ చోటుచేసుకోవడం విచారకరమన్నారు. బాధితులకు ఎమ్మార్పీఎస్తో పాటు ఇతర ప్రజాస్వామిక సంఘాల ద్వారా అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా బాధితులకు అండగా ఉంటామని, గ్రామ అభివృద్ధి కమిటీల వ్యవస్థను నిర్మూలించే పోరాటంలో కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఉద్యమ కార్యాచరణ
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సీనియర్ నాయకుడు సరికేల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కమిటీలకు వ్యతిరేకంగా పోరాట సమితితో కలిసి త్వరలో ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. జిల్లాకు చెందిన సమస్యపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సామాజిక బహిష్కరణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బట్టు శ్రీధర్, బాధితులు దిబ్బ సుదర్శన్, నర్సా గౌడ్, నారాయణ గౌడ్, గంగాధర్, దేవదాస్, దేవన్న, జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












