పిల్లల పార్కులు కేవలం వినోద కేంద్రాలు మాత్రమే కాకుండా, చిన్నారులను ప్రకృతికి దగ్గర చేస్తూ వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కేంద్రాలుగా పనిచేస్తాయని లక్ష్మీనగర్ పార్క్ అధ్యక్షులు, అత్తాపూర్ యోగ కేంద్రం గురువు పి. లక్ష్మీ మహేందర్ అన్నారు. ప్రతి పట్టణం, గ్రామంలో సురక్షితమైన వసతులతో కూడిన పిల్లల పార్కులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అత్తాపూర్ రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పిల్లల ఆటల పార్కుపై సన్నాహక సమావేశం మంగళవారం పార్క్ అధ్యక్షులు పి. లక్ష్మీ మహేందర్ అధ్యక్షతన జరిగింది.
ఆటలతో ఆత్మవిశ్వాసం పెంపు
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు, ప్రముఖ పత్రికా రచయిత నేదునూరి కనకయ్య మాట్లాడుతూ.. బాలల సర్వతోముఖాభివృద్ధిలో పిల్లల పార్కులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆటలు కేవలం వినోదం కోసమే కాకుండా, పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పిల్లల ఆటల పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.
మాజీ సైనికుడు చల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పిల్లల ఆటల పార్కుల వల్ల ఐక్యత, దేశభక్తి, ధైర్యం, సహనం వంటి లక్షణాలు అలవడతాయని అన్నారు. వంతుల వారీగా ఆడటం, తమ వంతు కోసం వేచి చూడటం ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక విలువలను సహజంగా నేర్చుకుంటారని ఆయన తెలిపారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది
లక్ష్మి చంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్కులో ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం ద్వారా చిన్నారులకు కొత్త స్నేహాలు ఏర్పడతాయని తెలిపారు. బుచ్చయ్య మాట్లాడుతూ.. పిల్లల ఆటల పార్కులు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు. పంచాక్షర రావు మాట్లాడుతూ.. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మధ్య పిల్లలు కలిసి ఆడుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేసి మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఎం. ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్కుల్లోని ఇసుక, ఆట వస్తువులతో వివిధ ఆకృతులు రూపొందిస్తూ ఆడుకోవడం ద్వారా పిల్లల్లో ఆసక్తి, సృజనాత్మకత పెరుగుతాయని అన్నారు. శారీరక ఆటలతో పిల్లల్లో ఊబకాయం తగ్గించేందుకు కూడా దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అత్తాపూర్ యోగ కేంద్రం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పార్క్ నిర్వాహకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


