నీవు అద్దమైనా కావాలి... నీవు దీపమైనా కావాలి అనే స్ఫూర్తిదాయక నినాదంతో సేవా పథంలో ముందుకు సాగుతున్న మై గిఫ్ట్ యువ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన ఆర్మీ సైనికులకు భాగ్యనగరంలో ఆత్మీయ సత్కారాలు అందజేశారు. అందరం బతకాలి... అందరం ఎదగాలి అనే సదుద్దేశంతో మారుమూల ప్రాంతాల్లో మార్పునకు బాటలు వేయాలనే సంకల్పంతో డా పెరుక రాజు 2000 సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించారు.
మారుమూల గ్రామంలో మొలకెత్తిన మై గిఫ్ట్ సేవా ప్రస్థానం నేడు దేశం నలుమూలలా విస్తరిస్తూ, సేవతో పాటు జాతీయతా స్ఫూర్తిని చాటుతోంది. డా పెరుక రాజు తన స్వగ్రామంలోని పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ సమకూర్చడంతో పాటు, ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఫలితంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి, ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం.
తాను సెలవుల్లో స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక స్పృహ, విలువలను బోధించేవారు. రక్త నిర్ధారణ శిబిరాలు, పేదలకు వస్త్రాల పంపిణీ, పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, ప్రతిభా బహుమతులు, విద్యార్థులకు వివిధ పోటీలు, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలు మై గిఫ్ట్ ప్రస్థానంలో భాగంగా కొనసాగుతున్నాయి.
సాహిత్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న వారిని ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా మై గిఫ్ట్ సాహితీ పురస్కారం అందజేయడం సంస్థ ప్రత్యేకత. ఈ సేవా పరంపరలో భాగంగా, దేశ రక్షణలో అంకితభావంతో సేవలందిస్తూ తమ తమ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ఆర్మీ సైనికులను మై గిఫ్ట్ సంస్థ రూపశిల్పి డా పెరుక రాజు ఆత్మీయంగా సత్కరించి అభినందించారు.
డా పెరుక రాజు సందేశం
ఈ సందర్భంగా డా పెరుక రాజు మాట్లాడుతూ, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలి. చెట్టు తన నీడను, ఫలాలను ఇతరులకు అందిస్తుంది; నది తన నీటిని తన కోసం దాచుకోదు. చెట్టులా, నదిలా పరుల కోసం జీవించినప్పుడే జీవితానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడే నిజమైన దేశభక్తుడు అని పేర్కొన్నారు.
సత్కారం అందుకున్న సైనికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో వెలువడనున్న తన ఆంగ్ల కవితా సంపుటి ను ప్రతి ఒక్కరూ చదవాలని డా రాజు కోరారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆంగ్ల ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రదీప్ కుమార్ రాజ్పుత్, శ్రవణ్ కుమార్ భట్, పెరుమాళ్, హీరా, ధీరజ్, అజయ్, అమన్, నిర్మల్, గౌతమ్, శివ, ప్రభాత్, హరీందర్, కౌశల్, ఆర్య, స్నేహిత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభను గుర్తించడం ప్రోత్సాహం... ప్రోత్సాహాన్ని పంచడం గొప్ప బహుమతి.












