ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మండల కేంద్రంలోని వేదభారతి పీఠంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైదిక కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. వేదభారతి పీఠ వ్యవస్థాపకులు వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన కార్యక్రమాల్లో భాగంగా, శుక్రవారం, శనివారం కూడా వేద పండితులు స్వస్తివాచనం, రాజ్యాధికార హోమం, ఆయుష్య హోమం, ధన్వంతరి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని, ఆయన నాయకత్వంలో దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సురక్షితంగా విలసిల్లాలని సంకల్పిస్తూ హోమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు వేద మంత్రోచ్ఛారణల మధ్య దేశ క్షేమం, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక వేదాశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంగార్డ్స్ చైర్మన్ సావులి రమేష్, వేద పాఠశాల విద్యార్థులు, వైదిక గురువులు, పీఠ నిర్వాహకులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేద విద్యానంద స్వామీజీ మాట్లాడుతూ, వేదమే భారతీయ సంస్కృతికి మూలాధారమని తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని వేద మంత్రాలతో నిర్వహించడం భారతీయ సనాతన సంప్రదాయంలో భాగమని పేర్కొన్నారు. వేద మంత్రాలతో నిర్వహించే హోమాలు వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు లోక కల్యాణం, ప్రకృతి సమతుల్యత, దేశ సుభిక్షతకు దోహదపడతాయని వివరించారు. నిత్యం వేద పఠనం వల్ల మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం అలవడుతుందని తెలిపారు. నేటి యువత వేద విద్యను అభ్యసించి సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సనాతన ధర్మం అంటే వేదం, వేదం అంటే సనాతన ధర్మం అనే విషయాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని వేద విద్యానంద స్వామీజీ పేర్కొన్నారు.











