కుంటాలలోని శాంతినికేతన్ విద్యానిలయం ప్రాంగణంలో నిర్మల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్-జూనియర్స్, సీనియర్స్ విభాగాల జిల్లా కబడ్డీ జట్లకు క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కుంటాల కమల్ సింగ్, శోభన, పంచాయతీ సెక్రటరీ రాజబాబు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేష్ తదితర అధికారులు హాజరయ్యారు. జాదవ్ రాజేష్ బాబు విశిష్ట అతిథిగా, రమణారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కుంటాల గ్రామ సర్పంచ్ జక్కుల గజేంధర్, మండల పెద్దలు వెంగళరావు, వివిధ ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలలకు సంబంధించిన పిఈటిలు, నిర్మల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్, ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ సునీల్, శ్రీనివాస్ భూమేష్, శాంతినికేతన్ విద్యానిలయం డైరెక్టర్ ప్రవీణ్, ప్రిన్సిపల్ సంతోష్ పాల్గొన్నారు.
క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం
ఈ సందర్భంగా విశిష్ట అతిథి జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ, కబడ్డీ మన తెలంగాణ మట్టిలో పుట్టిన క్రీడ. ఈ క్రీడకు మన మట్టితో ఎంతో బలమైన అనుబంధం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఎంపికలు ఎంతో ఉపయోగపడతాయి అన్నారు.
కమల్ సింగ్ మాట్లాడుతూ, కబడ్డీ కబడ్డీ అనే చప్పుడు మన గుండె చప్పుడుగా మారాలి. ఇక్కడి క్రీడాకారులు భవిష్యత్తులో భారత కబడ్డీ జట్టులో స్థానం సంపాదించి దేశ గౌరవాన్ని పెంచాలి అని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో క్రీడాకారులు, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.












