నిజామాబాద్, సెప్టెంబరు 17: టౌన్-2 పోలీస్స్టేషన్ పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద జరిగిన హరిబాబు హత్య ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, అక్కడ లభించిన ఆధారాలు తదితర అంశాలపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా, వేగవంతంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించడంతో పాటు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని సూచించారు. ప్రత్యక్ష సాక్షులు, ఘటనకు సంబంధించిన ఇతర వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంఘటనా స్థలంలో అవసరమైన పోలీసు బందోబస్తు, పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, టౌన్-2 ఎస్సై యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












