జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి సస్పెన్షన్ కాలానికి సంబంధించిన రూ.23,25,390 జీతం బిల్లులు, పదవీ విరమణ అనంతర పెన్షన్ సర్దుబాటుకు సంబంధించిన రూ.4,29,000 మొత్తాన్ని ప్రాసెస్ చేసి ముందుకు పంపేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచం వ్యవహారం వివరాలు
ఈ వ్యవహారంలో సబ్ ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ ఇద్దరూ కలిసి రూ.2.50 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో భాగంగా రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు.
ప్రైవేటు వ్యక్తి కూడా అరెస్ట్
అదే సమయంలో ప్రైవేటు వ్యక్తి వడ్డె జంగయ్య కూడా లంచం సొమ్ములో కొంత భాగాన్ని స్వీకరిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుల నుంచి రూ.లక్ష లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
న్యాయస్థానానికి తరలింపు
ముగ్గురు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.












