మండల పరిధిలోని వెంకటేశ్వర టాకీస్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో ముస్లిం సోదరులు మజారుద్దీన్, హజారుద్దీన్ రూ.31,000కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సంఘటన కుల, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
వెంకటేశ్వర టాకీస్ కాలనీవాసుల ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గణపతి మండపంలో లడ్డు వేలంపాట చేపట్టారు. ఈ వేలంలో గ్రామ ముస్లిం సోదరులైన మజారుద్దీన్, హజారుద్దీన్ సోదరులు పాల్గొని, రూ.31,000 చెల్లించి గణనాథుని లడ్డూను సొంతం చేసుకున్నారు. కుల, మతాలకు అతీతంగా జరిగిన ఈ సంఘటన అందరి ప్రశంసలు అందుకుంది. భగవంతుడు సర్వాంతర్యామి అని మరోసారి రుజువైందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఈ చర్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీకేపీ, శివ తదితరులు పాల్గొన్నారు.












