చింతలపాలెం గ్రామంలో వినాయక చవితి పూజా కార్యక్రమాల వివాదాల్లో మరణించిన దత్తు ప్రసాద్ శర్మ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మిర్యాలగూడ పట్టణంలో గురువారం పురోహితులు, అర్చకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు, అక్కడి నుంచి బంగారుగడ్డ చౌరస్తా, ఈదలగూడ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
బ్రాహ్మణుల పట్ల గౌరవంగా ఉండాలని, వారిపై మానసికంగా ఒత్తిడి గురి చేయరాదని ఈ సందర్భంగా పలువురు కోరారు. వినాయక పందిళ్లలో వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలని, అలా కాకుండా హోమాలు, కుంకుమ పూజలు, చండీ హోమాలు చేయడం సరైన విధానం కాదని పురోహితులు సూచించారు. కొన్ని పరిస్థితుల్లో బ్రాహ్మణులు కమిటీ వారు సూచించిన మేరకు చేస్తున్నారని, ఈ విధానం కూడా సరి అయింది కాదన్నారు.
ఇష్టారాజ్యంగా వాడవాడలకు విగ్రహాలు పెట్టి పూజారులపై ఒత్తిడి తీసుకురాకుండా, మూడు నాలుగు వీధులకు కలిపి ఒక విగ్రహం పెట్టుకొని సరైన పద్ధతులలో పూజ చేయించుకుంటే బాగా ఉంటుందని, అందరూ అక్కడ చేరుకొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చని పేర్కొన్నారు. అందువల్ల అన్ని ప్రాంతాల ప్రజల్లో ఐక్యత ఏర్పడుతుందన్నారు. ప్రజలు, వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఈ విషయాన్ని ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు పులి కృష్ణమూర్తి, పూల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ, కురుమేటి రాధాకృష్ణ శర్మ, చిట్యాల శ్రీనివాస్ శర్మ, నాగేందర్ శర్మ, పిల్ల లోకాచార్యులు, రాఘవాచార్యులు, కిరణ్ కుమార ఆచార్యులు, అనంతకృష్ణ, రామకృష్ణ, సుధాకర్ శర్మ, నాగభూషణ శర్మ శేషాచార్యులు, శబరి శర్మ, భైరవట్ల రాంబాబు శర్మ, సాంబయ్య శర్మ, మామిడాల రామ్మోహన్ శర్మ, జగదీష్ శర్మ, తోగ రాది వెంకటరమణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.












