సంగారెడ్డి జిల్లా మండలం పెద్దకంజర్ల గ్రామంలోని నేరెడ్చెరువులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
మృతులంతా మండలం ఇనోల్లోని శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మృతులను నర్సింహరాజు, సుమంత్, గణేష్, ఉదయ్‌కుమార్, శ్యామ్‌కుమార్, సిద్ధార్థ్గా గుర్తించారు. వీరిలో ఐదుగురు పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు కాగా, సిద్ధార్థ్ పదో తరగతి చదువుతున్నట్లు సమాచారం.
నిమజ్జనం కోసం మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు నీటిలోకి వెళ్లగా, వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చెరువులో లోతైన ప్రాంతానికి వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాద ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఒకే ఘటనలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో పెద్దకంజర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.












