నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట ఖజానా చెరువులో మొసలి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనితో సమీపంలోని వినాయక సాగర్ చెరువు పరిసర ప్రజల్లో ఆందోళన నెలకొంది. వినాయక నిమజ్జనం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట ఖజానా చెరువులో మొసలి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతుండటంతో, సమీపంలోని వినాయక సాగర్ చెరువు పరిసర ప్రజల్లో ఆందోళన నెలకొంది. వెంకటాద్రిపేట చెరువుకు కొద్దిదూరంలోనే వినాయక సాగర్ ఉండటంతో మొసలి అటువైపు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. వినాయక సాగర్ చుట్టుపక్కల కాలనీలకు చెందిన పలువురు యువకులు ప్రతిరోజూ ఉదయం చెరువులో స్విమ్మింగ్ చేస్తుంటారు. మొసలి సంచారం గురించి తెలియడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. అయినప్పటికీ కొందరు యువకులు స్విమ్మింగ్ చేస్తున్నారని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చెరువులోకి దిగాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
వినాయక సాగర్‌లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహిస్తారు. సమీప చెరువులో మొసలి కనిపించిందన్న సమాచారంతో నిమజ్జనానికి వచ్చే భక్తుల్లోనూ భయాందోళన నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు, యువత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మొసలిని గుర్తించి సురక్షితంగా పట్టుకుని, వినాయక సాగర్ సహా పరిసర చెరువుల్లో ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వినాయక నిమజ్జనం సమీపిస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












