ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మండలం ఆలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఓజోన్ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్ర అధికారి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులను ఉద్దేశించి రామకృష్ణారావు మాట్లాడుతూ, ఓజోన్ పొర భూమికి రక్షణ కవచంలా పనిచేస్తుందని, సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (యూవీ) కిరణాల నుంచి మానవులను, జంతువులను, మొక్కలను కాపాడుతుందని వివరించారు.
ఓజోన్ పొర దెబ్బతింటే చర్మ క్యాన్సర్, కంటి వ్యాధులు, పంటల దిగుబడి తగ్గడం వంటి తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని ఆయన హెచ్చరించారు.
ఓజోన్ పొరను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ హితమైన వస్తువులను వాడాలని, చెట్లను నాటాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం ఉప అటవీ క్షేత్ర అధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ విద్యార్థులతో ఓజోన్ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. మేము ఓజోన్ పొరను కాపాడుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్ర నాగకాంత్, డిప్యూటీ ఆర్ఓ మహమ్మద్ నజీర్ ఖాన్, ఉపాధ్యాయులు సంధ్య, సంతోష్, వెన్నెల, సుజాత మరియు వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.












