నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని పల్లవి మోడర్న్ రైస్‌మిల్లులో భారీగా ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ కేటాయింపులు, రికార్డుల్లోని నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మిల్లుకు మొత్తం 6,102.08 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, రికార్డుల ప్రకారం 5,904.435 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండాల్సి ఉంది. అయితే, తనిఖీల్లో కేవలం 79.44 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే లభ్యమైంది. దీంతో 5,824.995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పంచనామా.. నివేదిక
ఈ భారీ వ్యత్యాసం నేపథ్యంలో అధికారులు పంచనామా నిర్వహించి, వివరాలను నమోదు చేశారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిన అంశంపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
మిల్లర్ అందుబాటులో లేరు
తనిఖీల సమయంలో రైస్‌మిల్లర్ అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.












