గోపాల్పేట (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 14
వనపర్తి జిల్లా మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పుట్ట విష్ణు కుటుంబానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించి, మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆపదలో ఉన్న పేద కుటుంబానికి అండగా నిలిచి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన పుట్ట విష్ణు (44) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
విష్ణు మృతి విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ధన్వాడ నాగరాజు, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షురాలు మంద సత్యశీల రెడ్డి వెంటనే ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే తన అభయహస్తం ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఎమ్మెల్యే ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ధన్వాడ నాగరాజు ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందజేశారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న విష్ణు భార్యను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
స్థానికుల ప్రశంస
ఆపదలో ఉన్నవారికి వెంటనే స్పందించి తనవంతు సాయం అందించడం పట్ల స్థానికులు ఎమ్మెల్యే మేఘారెడ్డి మానవత్వాన్ని అభినందించారు. ప్రజాప్రతినిధిగా పేదల కష్టాల్లో పాలుపంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది ఆంజనేయులు, కురుమన్న యాదవ్, శ్రీశైలం యాదవ్, కందూర్ రమేష్, మేస్త్రి శివ, కుమార్ ట్రైలర్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.






