రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. ఆదివారం మండలం యాద్గార్ పల్లి గ్రామంలో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న త్రీఫేస్ విద్యుత్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్, సర్పంచ్ జోన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకుడు గాయం ఉపేందర్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో గ్రామంలో త్రీఫేస్ విద్యుత్ లైన్ స్తంభాలను ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
సాగునీటి సౌకర్యంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహబూబ్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












