ఒక పూట ఆకలి తీర్చుకోవడానికి ఆర్డర్ చేసిన ఆహారమే ఆరోగ్యానికి శాపంగా మారితే పరిస్థితి ఎంత ఆందోళనకరం బిజీ జీవితంలో ఇంటి వంటకు దూరమవుతున్న ప్రజలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, వీధి బండ్లు, ఆన్లైన్ డెలివరీలపై ఆధారపడటం పెరిగింది. అయితే ఆ ఆహారం ఎక్కడ తయారవుతోంది, ఎలాంటి ముడి పదార్థాలు వాడుతున్నారు, ఎంతకాలం నిల్వ చేశారు, పరిశుభ్రత పాటిస్తున్నారా అన్న ప్రశ్నలకు సమాధానాలు మాత్రం అంతుచిక్కడం లేదు.
హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఆహార తనిఖీలు పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పచ్చళ్లు, ఖోవా, పనీర్, పెరుగు, క్రీమ్, టీ పొడి వంటి పదార్థాల్లో కల్తీ వెలుగుచూసింది. ఒక తనిఖీలోనే 4,032 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 6,200 కిలోలకు పైగా నాసిరకం ముడి పదార్థాలు పట్టుబడ్డాయి. మరోచోట వందల కిలోల కల్తీ పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీలో పామాయిల్, వనస్పతి, ఇతర చౌక పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. ఇంత విస్తృతంగా ఆహార కల్తీ జరుగుతున్నప్పటికీ తనిఖీలు సరిపోతున్నాయా అన్నది ఆలోచించాల్సిన విషయం. హైదరాబాద్లో సుమారు 75 వేల తినుబండారాల దుకాణాలు ఉన్నట్లు ఒక నివేదిక పేర్కొనగా, 2025లో జీహెచ్ఎంసీ 9,656 తనిఖీలు నిర్వహించి 3,500 ఆహార నమూనాలు మాత్రమే సేకరించింది. ఆన్లైన్ డెలివరీ, రిటైల్ కేంద్రాల తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, ఆహారం-ఇతర వస్తువులను కలిపి నిల్వ చేయడం, సిబ్బందికి వైద్య ధ్రువపత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి.
ఇక్కడ మరో ప్రధాన సమస్య సిబ్బంది కొరత. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ఆహార భద్రత సూచీ సమాచారం ప్రకారం 81 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అవసరం కాగా, పూర్తికాల సిబ్బంది 36 మంది మాత్రమే ఉన్నట్లు గత అధికారిక డేటా చూపించింది. ఇంత పెద్ద ఆహార వ్యాపార రంగాన్ని ఇంత తక్కువ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించడం ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న. ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, తయారీ కేంద్రాలు, గోదాములు, డెలివరీ కిచెన్లపై ప్రమాద ఆధారిత తనిఖీలు పెంచాలి. మొబైల్ ల్యాబ్లు, ఆధునిక పరీక్షా సదుపాయాలు కూడా విస్తరించాలి. కల్తీ ఆహారం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు, రసాయన కాలుష్యాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. డయేరియా, టైఫాయిడ్ వంటి అనారోగ్యాలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు.
పదేపదే వేడి చేసిన నూనెల్లో హానికరమైన ఆక్సీకరణ ఉత్పత్తులు ఏర్పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు, మిఠాయిలు, మసాలాలు, పచ్చళ్లలోనూ కల్తీ జరిగే అవకాశం ఉన్నందున నిరంతర నిఘా అవసరం. ఇది కేవలం ఆహార శాఖ సమస్య కాదు. ప్రజారోగ్య వ్యవస్థకు తగిన నిధులు కూడా అవసరం. జాతీయ ఆరోగ్య విధానం-2017 ప్రకారం 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలనే లక్ష్యం ఉంది. అయితే 2021-22లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆరోగ్య వ్యయం జీడీపీలో 1.8 శాతం మాత్రమే. అదే సమయంలో ప్రజలు తమ జేబుల నుంచి చేసిన ఆరోగ్య వ్యయం రూ.3.56 లక్షల కోట్లు, ఇది మొత్తం ఆరోగ్య వ్యయంలో 39.4 శాతం. ప్రభుత్వ వైద్య సదుపాయాలు బలహీనంగా ఉంటే సామాన్యుడు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది.












