అమెరికాలో కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్న తెలుగు వ్యక్తి భరత్ కుమార్ పులిపాటి ఆస్పత్రి బెడ్ నుంచే తన గోడును వెళ్లబోసుకున్నారు. తన చివరి క్షణాలను సొంత ఊరిలో కుటుంబంతో గడపాలనే కోరికతో, స్వదేశానికి తిరిగి రావడానికి సాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు వ్యక్తి భరత్, క్యాన్సర్‌తో పోరాడుతున్నానంటూ తన కష్టాన్ని చెప్పుకుంటూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. తన ఆరోగ్యం విషమంగా ఉందని.. తన చివరి క్షణాలను కుటుంబంతో సొంత ఊరిలో గడపాలనే కోరిక ఉందని మనసులో మాట చెప్పుకొచ్చారు. తాను అమెరికా నుంచి సొంత ఊరికి వచ్చేందుకు సాయం చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆస్పత్రి బెడ్ మీద నుంచి మొరపెట్టుకున్నారు భరత్. తాజాగా భరత్ అభ్యర్థనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
తాను భరత్ సోదరి ప్రత్యూషతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నందున ప్రయాణాలు చేయొద్దని డాక్టర్ల టీమ్ సలహా ఇచ్చినట్లు తమకు తెలిసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తాము వారికి అండగా ఉంటామని.. వారి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉంటామని తెలిపారు. భరత్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు ప్రయాణాలు చేయొద్దని సూచించినట్లు లోకేష్ ట్వీట్ చేశారు.
మంత్రి నారా లోకేష్ ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందించారు. సార్.. మీరు వారి కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి అమెరికాకు పంపించి.. వారి ప్రయాణానికి, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియలు త్వరగా పూర్తి చేయడానికి సాధ్యమైనంత ఆర్థిక సహాయం అందించగలరా అని కోరారు. ఇది భరత్ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తెలియజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రాంతానికి చెందిన భరత్ కుమార్ పులిపాటి, గొప్ప భవిష్యత్తును ఊహించుకుని అమెరికా వెళ్లారు. అక్కడ కాలేయ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. ఆయన కుటుంబం వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఇబ్బందులు పడుతోంది. ఆయన కోసం ఫండ్ రైజ్ చేశారు.. ఈ నిధుల సేకరణలో దాదాపు 47శాతం పూర్తయ్యింది. ప్రతి ఒక్కరూ వీలైనంతగా సాయం చేయాలని భరత్ కుటుంబం కోరుతోంది. ప్రజలు అందించే ప్రతి చిన్న సహాయం ఎంతో ఉపయోగంగా ఉంటుందని.. తమకు అండగా నిలవాలని కోరారు.












