తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్న జిల్లాల్లో జిల్లా ముందువరుసలో ఉండటం ఆందోళనకరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్ అన్నారు. మిర్యాలగూడలో మంగళవారం బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా కుటుంబాల్లోని గర్భిణులు ఆరోగ్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారా, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు ఎక్కడ చేయించుకుంటున్నారు వంటి అంశాలపై నిఘా ఉంచాలని తెలిపారు.
పిసిపిఎన్డిటి చట్టం, ఎంటిపి చట్టాల అమలులో ఎలాంటి ఉల్లంఘనలకు తావులేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. గ్రామస్థాయిలో ప్రతి 1,000 మంది జనాభాకు ఒక ఆశా కార్యకర్త అందుబాటులో ఉన్నందున, వారు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గర్భిణులకు అవగాహన కల్పించాలని, ఆడపిల్లల జననాల సంఖ్య పెరిగేలా కృషిచేయాలని కోరారు.
జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ జి తిరుపతిరావు మాట్లాడుతూ, బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమ లక్ష్యం ఆడపిల్లలను రక్షించడంతో పాటు వారు ఆరోగ్యంగా పెరిగి, విద్యను అభ్యసించేలా అవకాశాలు కల్పించడమేనన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్నందున, ఇకముందు పుట్టబోయే ఆడపిల్లల కోసం అబార్షన్ చేయించుకోకుండా ఊయల కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
కొంతమంది స్వచ్ఛంద సంస్థలు దత్తత తీసుకుంటాయని, ఇలాంటి విషయాలు తల్లిదండ్రులకు తెలియజేసి ఆడపిల్లలకు జన్మ ఇచ్చేలా చూడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓడిటిటి డాక్టర్ కృష్ణకుమారి, మిర్యాలగూడ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ దీప, డాక్టర్ నగేష్, డాక్టర్ జమీర్, విష్ణు, సూపర్వైజర్లు, ఆషా కార్యకర్తలు పాల్గొన్నారు.












