కరీంనగర్ టౌన్ పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో సర్వే నంబర్ 71 లో ఉన్న 13 ఎకరాల 26 గుంటల మేలకుంట చెరువు శిఖం భూమి అక్రమ కబ్జాకు గురవుతోందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ () జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు. ఈ విషయంపై నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ టౌన్ పరిధిలోని సీతారాంపూర్ గ్రామం, సర్వే నంబర్ 71 లో ఉన్న 13 ఎకరాల 26 గుంటల మేలకుంట చెరువు శిఖం భూమి నిబంధనలకు విరుద్ధంగా కబ్జాకు గురవుతోందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ () జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్ గారిని కలిసి ఈ కబ్జాలపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ఫిర్యాదుపై నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్ గారు తక్షణమే స్పందించి, కరీంనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదు ప్రతిని వాట్సాప్ () ద్వారా కలెక్టర్‌కు పంపిస్తూ, కబ్జాలు మరియు అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం బండారి శేఖర్ మాట్లాడుతూ.. మేలకుంట చెరువు శిఖం భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. సర్వే నెం. 71లోని చెరువు శిఖం భూమిలో అసలు రోడ్డే లేనప్పటికీ, ఉన్నట్లు చూపిస్తూ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారు. క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ నక్ష, టిప్పన్ రికార్డులను పరిశీలించకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తేదీ 22-12-2023న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ఆధ్వర్యంలో కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ రూరల్ సర్వేయర్లు జరిపిన సంయుక్త సర్వే ప్రకారం.. దాదాపు 40 మందికి పైగా అక్రమార్కులు ప్రభుత్వ శిఖం భూమిని ఆక్రమించి రెసిడెన్షియల్ భవనాలు, ఫంక్షన్ హాళ్లు, బేస్మెంట్లు నిర్మించారని ఆర్డీఓ () స్పష్టమైన నివేదిక ఇచ్చారు. నివేదికలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్మాణాలు కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
చెరువు మరియు అనుబంధ నాలాలు కబ్జాకు గురికావడం వల్ల స్వల్ప వర్షానికే ఆర్టీసీ వర్క్‌షాప్ సమీపంలోని సూర్యనగర్ కాలనీ జలమయమవుతోంది. కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ ఆటంకం ఏర్పడుతోందని, స్థానిక ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేలకుంట చెరువు శిఖం భూమిలో అక్రమంగా రోడ్డు ఉన్నట్లు చూపిస్తూ భవన నిర్మాణ అనుమతులకు సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి. చెరువు శిఖం భూమిలో మంజూరు చేసిన భవన నిర్మాణ అనుమతిని రద్దు చేసి, అక్కడ జరుగుతున్న అపార్ట్మెంట్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేసి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. సర్వే నెం. 71లోని మేలకుంట చెరువుకు తక్షణమే ఎఫ్టిఎల్ () మరియు బఫర్ జోన్ హద్దుల పిల్లర్లు ఏర్పాటు చేసి, చెరువును కబ్జాల నుండి శాశ్వతంగా రక్షించాలి. ప్రభుత్వ శిఖం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో తేల్చడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి.












