పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అనే సందేశంతో నిర్మల్ పట్టణంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా మాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
బ్యాంకు ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా ధర్మసాగర్ పరిసర ప్రాంతాలతో పాటు బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. వీధులు, ప్రజా రవాణా కేంద్రాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎల్డీఎం రామ్‌గోపాల్, టీజీబీ ప్రాంతీయ మేనేజర్ నవీన్‌తో పాటు పలువురు బ్యాంకింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












