సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రంప పంచాయతీ పరిధిలోని రంప శివాలయ ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శివాలయ ప్రాంగణం, దాని చుట్టుపక్కల విపరీతంగా పెరిగిన తుప్పలు, పిచ్చి మొక్కలను స్వచ్ఛందంగా తొలగించి శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రం చేసిన అనంతరం, ఆలయ ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతీకగా కొబ్బరి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షులు ఈక బుల్లి కొండలు మాట్లాడుతూ, దేవాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవడంలో భాగంగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) మాట్లాడుతూ, సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుండ్ల కృష్ణారెడ్డి, రంపచోడవరం బిజెపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోడి జంగం దొర, దాడి వీర గనిరాజు, బిజెపి జిల్లా నాయకులు తుర్రం బాబురావు, పిమ్మే శ్రీను, అడపా సతీష్, బుద్ధా త్రినాధ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు కారం చిన్నబ్బాయి దొర, రంప పంచాయతీ ప్రతినిధులు జరత వినోద్, కొమరం బుచ్చిరాజ్, ఆదిరెడ్డి, కొమరం శాంతి రాజు, సేవా సంకల్ప్ అభియాన్ సభ్యులు, ఆలయ అర్చకులు, స్థానిక భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు.












