నిర్మల్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన పలు మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రలను ప్రారంభించారు.
నిర్మల్ పట్టణంలోని బుధవారపేట్ నెం.1 గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి శుక్రవారం, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎస్పీ జానకి షర్మిల తో కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సమన్వయంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని పలు వినాయక మండపాల వద్దకు వెళ్లి, ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి నిమజ్జన శోభాయాత్రలను ప్రారంభించారు.
ఏర్పాట్ల పరిశీలన
అనంతరం, వినాయక సాగర్ నిమజ్జన ఘాట్‌ను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు, ప్రజలు, వినాయక మండలి నిర్వాహకులు పరస్పరం సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












