రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, అర్హులైన బీడీ కార్మికులకు చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ () జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. 28/02/2014 నాటి పీఎఫ్ కటాఫ్ ను కూడా ఎత్తివేయాలని కోరింది.
ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక పెన్షనర్స్ భవన్ నుండి జిల్లా కోర్టు మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
కార్మికుల ఆవేదన
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజన్న మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో జీవిస్తున్న కార్మికులు బీడీ కార్మికులు మాత్రమేనని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన బీడి పరిశ్రమ రోజురోజుకు క్షీణించిపోయి నిర్వీర్యం అవుతుందని తెలిపారు. అనేక కారణాలతో ఈ కార్మికుల పని దినాలు పూర్తిగా తగ్గిపోయాయని, ఉపాధి కష్టంగా మారిపోయిందని, దీంతో పూట గడవడం కూడా కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షన్ అర్హతపై ఆంక్షలు ఎత్తివేయాలి
గతంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన విధానం ప్రకారం, ప్రావిడెంట్ ఫండ్ ఉన్నవారు మాత్రమే ఆసరా పెన్షన్ కు అర్హులని ప్రకటించింది. తర్వాత చాలా మంది బీడీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ నంబర్ వచ్చినప్పటికీ, 28/02/2014 తేదీ నాటికి పీఎఫ్ కటాఫ్ డేట్ పెట్టడంతో చాలామంది కార్మికులు జీవనభృతి పొందలేకపోయారు. కాబట్టి ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే బీడీ కార్మికులు ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నామని వెల్లడించారు.
అన్ని కేటగిరీలకు అవకాశం కల్పించాలి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరినాటికి పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని అప్లికేషన్ మోడల్ ను విడుదల చేసింది. అందులో 7 రకాల వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కానీ బీడి కార్మికులకు సంబంధించిన బీడీ కార్మికులు, బీడి ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు మరియు బీడీ కమిషన్ దారులు, టేకేదారులకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేదు. ఇది చాలా అన్యాయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కేటగిరీల కార్మికులకు, అంటే బీడీ కార్మికులు, బీడి ప్యాకర్, నెలసరి ఉద్యోగులు మరియు బీడీ కమిషన్ దారులు, టేకేదారులకు సంబంధించి పెన్షన్ దరఖాస్తు అప్లికేషన్ లో అవకాశం ఉండేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం. బక్కన్న, జిల్లా కార్యదర్శి ఆర్. రామలక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. గంగన్న, జిల్లా కార్యదర్శి కె. లక్ష్మి, జిల్లా కోశాధికారి ఎం.డి. గఫూర్, జిల్లా నాయకులు గంగమణి, రేష్మ, దేవవ్వ, కమల, కవిత తదితరులు పాల్గొన్నారు.












