నిజామాబాద్, 1 October
పొద్దున లేస్తే కేసీఆర్ ఫ్యామిలీని వ్యక్తిత్వ హననం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయానికి ప్రజలే ఖననం చేస్తారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు.
పొద్దున లేస్తే కేసీఆర్ ఫ్యామిలీని వ్యక్తిత్వ హననం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయానికి ప్రజలే ఖననం చేస్తారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన జీవన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది మళ్ళీ కేసీఆర్ రాజ్యమేనని ఉద్ఘాటించారు.
కాంగ్రెస్, టీడీపీల హయంలోనే సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని మండిపడ్డారు. కేటీఆర్ హయంలో సిరిసిల్ల సిరులొలికే జిల్లాగా మారిందని, సిరిసిల్ల చేనేతల తలరాత మార్చిన అభినవ బ్రహ్మ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన పేర్కొంటూ, సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుశరం లేకుండా సిరిసిల్ల పోయి మసిబూసి మారేడు కాయ చేసే కుట్ర చేశారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో సంక్షేమంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వెలుగులు విరజిమ్మితే, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ సంక్షోభంలోకి చేనేతలు నెట్టివేయబడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్లే ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికులు మళ్ళీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా విలసిల్లిన సిరిసిల్లకు ఉరివేసిన రేవంత్రెడ్డి ఏ మొఖం పెట్టుకొని సిరిసిల్ల కు పోయినవని, చేనేతల ద్రోహి అంటూ జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్ని రాజకీయ శక్తులు కలిసినా, మరెన్ని కుట్రలు చేసినా సిరిసిల్ల ప్రజలు ఎప్పటికీ కేటీఆర్కే పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ను మళ్ళీ సీఎంగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆర్మూర్ లో వివిధ పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్ చేరడం శుభ పరిణామమని అన్నారు.
ఉమ్మడి జిల్లా ఎప్పటికీ బీఆర్ఎస్ ఖిల్లా అని ఆయన అభివర్ణించారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగిరేయడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో వార్ వన్ సైడే, కారు జెట్ స్పీడ్ ను ఆపలేరని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 సీట్లు బీఆర్ఎస్ వేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కు పడే తెలంగాణ ఓట్ల ముందు కాంగ్రెస్ నోట్లు నిలవ లేవన్నారు.
జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధమని, బీఆర్ఎస్ పార్టీకి తొలి అధికార పదవినందించిన చరిత్ర జిల్లాదేనని, కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడంలోనూ జిల్లాదే ప్రధాన పాత్ర అని జీవన్ రెడ్డి పేర్కొంటూ, ఇందూరు జిల్లా పంతం, ఇందిరమ్మ హింసారాజ్యం అంతం అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అంటేనే ఫాదర్ ఆఫ్ లయ్యర్, తెలంగాణ ప్రజలను హింస పెడుతున్న అభినవ డయ్యర్ అని ఆయన అభివర్ణించారు. దేవుళ్ళకే శఠగోపం పెట్టిన ఘనుడు అని, ప్రజలను కొట్టడం, కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డికి తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు మహావృక్షమన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం ఎవడబ్బతరం కాదని ఆయన స్పష్టం చేశారు.












