మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 45 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచులు విన్నవించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, వచ్చే సర్వసభ్య సమావేశం నాటికి, అంటే 45 రోజుల్లోగా సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఇరిగేషన్, విద్యుత్, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పౌరసరఫరాల, విద్యా, స్త్రీ శిశు సంక్షేమ, పశుసంవర్ధక, డివిజనల్ అటవీ, ఉద్యానవన, గృహ నిర్మాణ శాఖల పనితీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అందేలా చూడాలని ప్రభుత్వ అధికారులను, సర్పంచులను ఎమ్మెల్యే సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతి సర్పంచ్, అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, ఆ విషయాన్ని సర్పంచులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.












