మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, 45 రోజుల్లోగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచులు విన్నవించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, వచ్చే సర్వసభ్య సమావేశం నాటికి, అంటే 45 రోజుల్లోగా సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పౌరసరఫరాల శాఖ, విద్యాశాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ, డివిజనల్ అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, గృహ నిర్మాణ శాఖ తదితర శాఖల పనితీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అందేలా చూడాలని ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను, సర్పంచులను సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతి సర్పంచ్, అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, ఆ విషయాన్ని సర్పంచులు తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.












