కేశంపేట్, 8 September
గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్ ను అవమానించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.
గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఒక దళిత స్పీకర్ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అవమానించడం ఎక్కడి ప్రజాస్వామ్యమని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసి (గిరిజన విభాగం) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శీను నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనగళ్ల రమేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నేతలు బాదేపల్లి సిద్ధార్థ, జాంగారి రవి మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ను అవమానించిన ఎమ్మెల్సీలు తాతా మధు, నాగర్ కుంట నవీన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఆదివాసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శీను నాయక్ డిమాండ్ చేశారు. స్పీకర్ పట్ల దుర్భాషలాడిన ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని మరిచి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ పోలీసులపై దాడి చేయడం, గుండాయిజాన్ని ప్రదర్శించడం అత్యంత దారుణమని అన్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్, అతని వెంట ఉన్న బీఆర్ఎస్ గుండాలు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండల పార్టీ అధ్యక్షుడు అనగళ్ల రమేష్ అన్నారు. స్పీకర్ ఆత్మగౌరవంపై దాడిని ఎట్టి పరిస్థితుల్లో సహించలేమని పేర్కొన్నారు. తాత మధు, నవీన్ రెడ్డి లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న స్పీకర్ పట్ల అసభ్యకరమైన, అవమానకరమైన వాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటడం, వ్యక్తిగత దూషణలకు దిగడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధ్యతారహితమైన చర్య అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం ఇలాంటివి సహించారని, శాసనమండలి నిబంధనల ప్రకారం దీనిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.
జరిగిన సంఘటనపై తాతా మధు, నవీన్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ అగ్ర నాయకులు తక్షణమే స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నేత బాదేపల్లి సిద్ధార్థ డిమాండ్ చేశారు. తాతా మధు, నవీన్ రెడ్డి లపై వెంటనే కేసు నమోదు చేయాలని అన్నారు. అసెంబ్లీ సమావేశానికి నల్ల చుక్కాలు వేసుకొని రావడమే కాకుండా, బజార్లో బట్టలు చింపుకొని చిల్లర వేషాలు వేయడం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు. ఇలాంటి దిగజారుడు నేతల పట్ల కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత నాయకుల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.
చింత చచ్చినా పులుపు చావనట్లుగా ఓడిపోయినా టిఆర్ఎస్ నాయకుల్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదని ఎస్సీ సెల్ నేత జాంగారి రవి అన్నారు. గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్ను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఉపయోగించిన అసభ్య పదజాలం ఆ పార్టీ నాయకుల అహంకారాన్ని మరోసారి బయట పెట్టిందని అన్నారు. స్పీకర్ పదవికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని, అలాంటి పదవిలో ఉన్న దళిత స్పీకర్ ను దూషించడం సరికాదని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని గౌరవించాలన్న కనీస బాధ్యత ఆ పార్టీకి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆయనను అవమానించడం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. తాతా మధు, నవీన్ రెడ్డి తమ వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకొని దళిత జాతికి క్షమాపణ చెప్పకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.












