స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు ప్రభుత్వ మోసపూరిత వైఖరిని బట్టబయలు చేసిందని సిపిఐ(ఎం) పేర్కొంది. ఈ నేపథ్యంలో, 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిన విషయం తెలిసి కూడా, ఎన్నికల లబ్ధి కోసం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు సిద్ధమని కూటమి ప్రభుత్వం హడావుడి చేసిందని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇంకా పరిశీలనలో ఉందని హైకోర్టులో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు 34 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులన్నింటికీ మద్దతు ఇస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆటంకంగా ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయడానికి పార్లమెంట్లో చట్ట సవరణకు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడంలేదో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వారాల ముందు 34 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకురావడం బీసీలను దగా చేయడానికి కూటమి ప్రభుత్వం ఆడిన నాటకమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ కోరింది.












