నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు బసవరాజ్పై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ యాదవ్ డిమాండ్ చేశారు. మండలం తాడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన సమస్యలను ప్రశ్నించినందుకే ఈ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై వార్తలు రాసినందుకు జర్నలిస్టులను కేసులతో భయపెట్టడం సరికాదని సునీల్ యాదవ్ అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, జర్నలిస్టు బసవరాజ్కు న్యాయం చేయాలని ఆయన కోరారు.
అధికారులకు సూచన
ఘటనకు సంబంధించిన వాస్తవాలను అధికారులు నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. తాడెం గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలపై గ్రామస్తుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, సంబంధిత అధికారుల పాత్రపై విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని సునీల్ యాదవ్ పేర్కొన్నారు.











